హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమితులైన బొత్స సత్యనారాయణకు హైదరాబాదులో మంగళవారం ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి పెద్ద యెత్తున చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ వెంట పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. విమానాశ్రయం నుంచి ఆయన తన ఇంటికి చేరుకున్నారు.
బొత్స సత్యనారాయణను ఆయన నివాసంలో కాంగ్రెసు తెలంగాణ నేతలు పలువురు కలిశారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బొత్స సత్యనారాయణను కలిసినవారిలో తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి కృష్ణా రావు కూడా ఉన్నారు. విమానాశ్రయంలో బొత్సకు స్వాగతం పలికినవారిలో మంత్రులు, శాసనసభ్యులు కూడా ఉన్నారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.