వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: కోవిడ్ కారణంగా తెలుగు రాష్ట్రాల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రక్తదానం

''ప్రస్తుతం రక్తం లోటు తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావం తలసేమియా రోగులపై పడింది. వారికి రక్తం ఎక్కించడం ప్రాణావసరం.’’ అని బీబీసీతో చెప్పారు రెడ్ క్రాస్ తెలంగాణ కోఆర్డినేటర్ విజయ్ కుమార్.

''ప్రస్తుతం రక్తం నిల్వ తగ్గింది. దీంతో రక్త దానం క్యాంపులు నిర్వహిస్తున్నాం. కానీ వచ్చే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఎవరూ రావడం లేదు. సాధారణంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గర రక్తదాన శిబిరం పెడితే, వంద మంది తక్కువ కాకుండా వచ్చేవారు. కానీ ఈసారి కేవలం 15 యూనిట్లే దొరికింది. మాకే చాలా ఆశ్చర్యం వేసింది. కరోనా భయంతో ఎవరూ రావడం లేదు’’ అని బీబీసీతో చెప్పారు ఉస్మానియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ సువర్ణ కుమారి.

అయితే రక్తదాన శిబిరాల దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ తో పాటూ, ఇతర అన్ని నియంత్రణా చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె వివరించారు.

రక్తం

తెలుగు రాష్ట్రాల్లో రక్తం ఎంత స్టాక్ ఉంది, ఎంత లోటు ఉన్నది అనేది స్పష్టమైన లెక్క లేదు. రెడ్ క్రాస్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు, ఐపిఎం, ఎన్ హెచ్ ఎం వంటి సంస్థలు వేర్వేరుగా రక్తనిధి నిర్వహణ చూస్తుంటాయి. దేశవ్యాప్తంగా రక్తం అందుబాటు గురించి ఈ రక్త కోష్ అనే వెబ్ సైటును కేంద్రం నిర్వహిస్తుంది. ఈ రక్త కోష్ వెబ్ సైట్ ప్రకారం ఏప్రిల్ నుంచి రక్తదానాలు విపరీతంగా తగ్గాయి. 2020లో కూడా ఫిబ్రవరి మధ్య నుంచి తగ్గిన రక్తదానాలు మే చివర్లో పుంజుకున్నా, సాధారణ స్థాయికి వెళ్లలేదు. ఈ ఏడాది ఆ సమస్య ఉండదనుకున్నారు కానీ, మళ్లీ ఏప్రిల్ నుంచి పరిస్థితి మారిపోయింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాల నిర్వహణ కూడా తగ్గింది.

సాధారణంగా వేసవి కాలంలో రక్తం స్టాక్ తగ్గుతుంది. దానికి పలు కారణాలు ఉంటాయి. వేసవిలో రక్తం ఇవ్వడానికి కొందరు ఆసక్తి చూపరు. అలాగే విద్యాసంస్థలు సెలవులు ఉంటాయి కాబట్టి, అక్కడ రక్తదాన శిబిరాలు పెట్టడానికి ఉండదు. దీంతో ప్రతీ ఏటా మార్చి నుంచి జూన్ వరకూ రక్తం అందుబాటు చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈసారి కరోనా సమస్య దానికి తోడైంది.

''గత ఏడాది కూడా మమ్మల్ని ఈ సమస్య వేధించింది. లాక్ డౌన్ విధించినప్పుడు రక్తం కోసం చాలా ఇబ్బంది పడ్డాం. లాక్ డౌన్ వల్ల చాలా మంది ఆపరేషన్లు వాయిదా వేసుకున్నారు. ఆ మేరకు అవసరం తగ్గింది. కానీ తలసేమియా రోగుల పరిస్థితి అలా కాదు. తిరిగి ఈ ఏడాది అదే పరిస్థితి ఎదురువుతోంది. కరోనా దెబ్బకు, లాక్ డౌన్ లేకపోయినా రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. అటు కాలేజీలకు సెలవులు ఉండడంతో క్యాంపుల సంఖ్య తగ్గింది.’’ అన్నారు విజయ్ కుమార్.

రక్తం అవసరం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ముందుగా ప్లాన్ చేసుకున్న ఆపరేషన్లకు, రెండు ప్రమాదాల సమయంలో, మూడవది తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధుల వారికి. మొదటి రెండు సందర్భాల్లో అంటే ఆపరేషన్లూ, ప్రమాదాల సమయంలో రక్తం సేకరించిన నెల లోపు ఎప్పుడైనా ఎక్కించవచ్చు. కానీ తలసేమియా రోగులకు మాత్రం రక్తం సేకరించిన ఐదు రోజుల లోపే ఫ్రెష్ రక్తం ఎక్కించాలి. వారికి ప్రతీ 20 రోజులకీ రక్తం ఎక్కించాల్సి వస్తుంది. దీంతో ఈ రోగులకు ఈ పరిస్థితి ప్రాణ సంకటం.

రక్తదానం

కరోనా వర్సెస్ బ్లడ్

''కరోనా వస్తే 28 రోజుల వరకూ రక్తం ఇవ్వకూడదు. అలాగే వ్యాక్సీన్ వేసుకుంటే మొదటి డోస్ వేసుకున్న 56 రోజులు, రెండవ డోస్ వేసుకున్న 28 రోజుల వరకూ రక్తం ఇవ్వకూడదని మార్గదర్శకాలు ఉన్నాయి. దాంతో రక్తం ఇవ్వాలన్న ఆసక్తి ఉన్న వారు కూడా ఇవ్వలేరు. దీంతో రక్త సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం’’ అని బీబీసీతో చెప్పారు నేషనల్ హెల్త్ మిషన్ బ్లడ్ డ్రైవ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్.

హైదరాబాద్లోని నాలుగు పెద్ద ప్రభుత్వ రక్త కేంద్రాలైన ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంజెఎంలతో పాటూ కొన్ని జిల్లా కేంద్రాల్లోని పెద్ద బ్లడ్ బ్యాంకులకు రక్తం అందే ఏర్పాట్లు వీరు చూస్తారు. ''ఆయా కేంద్రాల్లో రక్త లభ్యత, అవసరం మధ్య తేడా చూసి డ్రైవ్ లు పెడుతుంటాం.’’ అన్నారు అనిల్.

తరచూ రక్తదానం చేసే వారు వ్యాక్సీన్ వేసుకుంటే ఆ మేరకు వారు రక్తం ఇచ్చే అవకాశం లేకపోతోంది. దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సీన్ ఊపందుకుంటోన్న వేళ వీలైనంత రక్తం సేకరించడానికి ఈ సంస్థ విస్తృతంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు పలు సంస్థల వారు.

''ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత వ్యాక్సీన్ తీసుకుంటే సుమారు రెండు నెలల పాటూ వారు రక్తం ఇవ్వలేరు. అందుకే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచారం ప్రారంభించింది. వ్యాక్సీన్ వేయించుకునే ముందు రక్తదానం చేయమని పిలుపునిస్తోంది.’’ అని చెప్పారు విజయ్ కుమార్.

కరోనా సమయంలో సోషల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేసినా రక్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు.

''ప్రస్తుతం పోలీసులు, ఆర్మీ వంటి వారి సహకారంతో క్యాంపులు పెడుతున్నాం. ఈ విషయంలో పోలీసుల సహకారం మరువలేనిది. గత లాక్ డౌన్ సమయంలో సైబరాబాద్, హైదరాబాద్ పోలీసుల సహకారంతోనే రక్త సేకరణ చేయగలిగాం. ఇప్పుడు కూడా వారే సహకరిస్తున్నారు. అటు కొన్ని విద్యార్థి సంఘాల వారూ ముందుకు వస్తున్నారు.’’ అన్నారు విజయ్ కుమార్.

రక్తదానం

రక్తం ఇవ్వడానికి వెళ్తే కరోనా పరీక్షలు చేస్తారా?

ప్రస్తుతం రక్తదానం సమయంలో కరోనా పరీక్షలు చేయడం లేదు. కేవలం, వారికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని మాత్రమే తెలుసుకుంటున్నారు. రక్తదాన అంగీకర పత్రంలోనే కరోనా లక్షణాలు, అంతకుముందు ప్రయాణం వివరాలు వంటివి తీసుకుంటన్నారు. అయితే రక్త దానం చేయడానికి వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేస్తున్నారన్న వార్తలు నిజం కాదన్నారు ఉస్మానియా ఆసుపత్రి రక్త నిధి అధికారి సువర్ణ కుమారి.

''రక్తం ద్వారా కరోనా సోకుతుందని ఎక్కడా నిరూపణ కాలేదు. దానికి ఆధారాల్లేవు. అయినా ముందు జాగ్రత్తగా, ఎవరైనా రక్తం ఇచ్చాక, వారికి పాజిటివ్ అని తేలితే, ఆ రక్తాన్ని ఉపయోగించడం లేదు. ఆ రక్తాన్ని పక్కన పెట్టేస్తాం.’’ అని తెలిపారు విజయ్ కుమార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telugu states: There is a shortage of blood in the blood banks of due to Covid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X