కిమ్ మరణించకున్నా వేలాది జీవాలు బలి.. ఇండియాలోనూ ఆ వైరస్ కలకలం.. ఇదికూడా చైనా నుంచే..
నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించలేదన్న శుభవార్తను ఎంజాయ్ చేసేలోపే ఉత్తరకొరియన్లకు మరో సంకటంలో చిక్కకుపోయారు. తమ దేశంలో ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాలేదని సగర్వంగా చెప్పుకున్న ఉత్తర కొరియా.. ప్రస్తుతం 'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎస్ఎఫ్)' వైరస్ ధాటికి విలవిలలాడుతోంది. ఇప్పటికే వేలాది జీవాలు బలైపోయాయి. ఇటు ఇండియాలోనూ ఆ ప్రమాదకర వైరస్ అడుగుపెట్టేసి రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది..

ఉ.కొరియాపై పిడుగు..
అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఉత్తరకొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అఫ్‌కోర్స్, అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తే అన్ని రకాలుగా ఆదుకుంటామని ఐక్యరాజ్యసమితి భరోసా ఇచ్చినా కిమ్ జాంగ్ వినిపించుకోకపోవడం వేరే సబ్జెక్ట్. ఉత్తరకొరియాలో ప్రతి కుటుంబం ఒకటి నుంచి మూడు పందుల్ని విధిగా పెంచుతుంటారు. ఆ దేశ ఎకానమీలో పోర్క్ వాడకం, ఎగుమతులు వాటా గణనీయంగా ఉంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎస్ఎఫ్) ప్రధానంగా పందులకు మాత్రమే సోకే వైరస్. బర్డ్ ఫ్లూ ఎలాగైతే పౌల్ట్రీ పరిశ్రమను, దానిపై ఆధారపడ్డ లక్షలాది మంది జీవితాలను నాశనం చేసిందో, ఏఎస్ఎఫ్ కూడా పిగ్ ఫార్మింగ్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే కొరియా వ్యాప్తంగా వేల సంఖ్యలో పందులు చనిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి.

ఇండియాలోనూ..
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకముందే భారత్‌లో ఏఎస్ఎప్ కేసుల పెరుగుదల కలకలం రేపుతున్నది. బుధవారం నాటికి దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 50వేలకు, మరణాలు 1700కు చేరువకాగా, ఆ కొత్త వైరస్ ఇప్పటికే 3వేలకుపైగా పందుల్ని బలితీసుకుంది. ప్రధానంగా దేశంలోనే అత్యధిక పందులకు నిలయమైన అస్సాంలో ఆ పక్కనే ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏఎస్ఎఫ్ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశీయంగా ఆ వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అంతర్భాగమైన నేషనల్ పిగ్ రీసెర్చ్ సెంటర్ తీవ్రంగా కృషి చేస్తున్నది.

అత్యంత ప్రమాదకరం..
కడుపుతో ఉన్న ఆడ పందులకు ఏఎస్ఎఫ్ వైరస్ సోకితే నాలుగైదు రోజుల వ్యవధిలోనే వాటికి అబార్షన్ అయిపోతుంది. ఇప్పటిదాకా ఆ వైరస్ సోకిన పంది ఒక్కటి కూడా బతకలేదు. అంటే డెత్ రేటు 100 శాతమన్నమాట. ఏఎస్ఎఫ్ బాధిత పంది తినే ఆహారం, దాని లాలాజలం, రక్తం, రక్తనాళాల ద్వారా ఇతర పందులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీంతో పందులను కూడా క్వారంటైన్ లో ఉంచుతూ కాపాడుకుంటున్నారు. ఒక ప్రాంతంలోని పందులు వేరే ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రెండో దశ వ్యాప్తి చైనా నుంచే..
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కు సంబంధించిన మొదటి కేసు 1921 లో కెన్యా , ఇథియోపియాలో వెలుగు చూసింది. బ్రిటిష్ వలస పాలకులు లోకల్ పందుల్ని తమ దేశానికి తీసుకెళ్లడంతో 1950లనాటికి ఆ వైరస్ యూరప్ కు చేరిందని, అక్కణ్నుంచి చైనాకు దిగుమతైందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే 2018 తర్వాత చోటుచేసుకున్న రెండో దశ వ్యాప్తి మాత్రం చైనా నుంచే జరిగినట్లు ఆధారాలు అక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) భావిస్తోంది. చైనాలో 60 శాతం పందులకు ఈ వైరస్ సోకగా, అక్కణ్నుంచి టిబెట్ కు, బోర్డర్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు, ఆ తర్వాత అస్సాంకు వైరస్ వ్యాపించినట్లు ఐసీఏఆర్ అధికారులు చెప్పారు.