విజయవాడ దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం మళ్లీ వాయిదా ? కరోనాతో గడ్కరీ దూరం...
నెల రోజుల క్రితమ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాతో కేంద్రమంత్రి గడ్కరీ దూరం కావడంతో ఈ కార్యక్రమం వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఫ్లైఓవర్‌తో పాటు విజయవాడలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు గడ్కరీ రేపు ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది.
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ డ్రోన్ వీడియో.. వావ్ అంటోన్న నెటిజన్లు..
ఆరేళ్లుగా నత్తనడకన సాగిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు తాజాగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీని ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 4న ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు గడ్కరీ సిద్ధమయ్యారు. అదే సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హఠాన్మరణంతో కేంద్రం సంతాపదినాలు ప్రకటించడంతో ప్రారంభోత్సవం ఈ నెల 18కి వాయిదా పడింది. అయితే తాజాగా గడ్కరీకి కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్లో చేసిన ప్రకటనతో ఈ కార్యక్రమం మరోసారి వాయిదా పడుతోంది.

ఈసారి విజయవాడ వచ్చి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని గడ్కరీ భావించారు. అయితే అనూహ్యంగా కరోనా నిర్ధారణ కావడంతో ఆయన రాలేకపోతున్నట్లు తెలిసింది. గడ్కరీ లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేకపోవడంతో అనివార్యంగా ప్రారంభోత్సవం మరో తేదీకి వాయిదా పడబోతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.