అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ కు మద్దతుగా నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో జరిగి ఉంటే బాగుండేదని, ప్రస్తుతం కరోనా కొనసాగుతున్న తరుణంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు.
జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, ఉద్యోగుల తీరు ఇలా దేశ చరిత్రలోనే లేదు : యనమల ఫైర్

ప్రజల ,ఉద్యోగుల సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి
గత ఏడాది ఎన్నికలు వాయిదా వేయడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, అధికారులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజల ,ఉద్యోగుల సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని సుమన్ అభిప్రాయపడ్డారు. కరోనా ప్రబలుతున్న సమయంలో ఈ తరహా నిర్ణయాలు మంచిది కాదని సుమన్ జగన్ సర్కార్ కు మద్దతు పలికారు. ఆలయాలపై దాడులు విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని కొందరు కావాలనే విగ్రహాలను ధ్వంసం చేస్తూ, దానిని ప్రభుత్వానికి అంటగడుతున్నారు అని సుమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్ నిర్ణయాలతో రాష్ట్రం ప్రగతిపథంలో
ఏపీలో సీఎం గా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని, అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని సుమన్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం చేశారని, రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా అదే తప్పు పునరావృతం అయిందని పేర్కొన్న సుమన్, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సరైన నిర్ణయం కాదన్న సుమన్
వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నారని, పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యంగ్ అండ్ ఎనర్జిటిక్ సీఎంను ఎన్నుకున్నారని ,రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పరిపాలన విషయంలో సంతోషంగా ఉన్నారని నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై జగన్ సర్కార్ కు మద్దతుగా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సరైనది కాదని నటుడు సుమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.