ఆ బ్యాంకే నకిలీ.. మళ్లీ రూ.లక్షల్లో డిపాజిట్లు, పోలీసులను ఆశ్రయించిన బాధితులు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరులో నకిలీ బ్యాంకు ఏర్పాటు చేసి ప్రజలను మోసగిస్తున్నారంటూ కొందరు బాధితులు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు అరండల్ పేటలో ఓ వ్యక్తి బ్యాంకును ఏర్పాటు చేసి అందులో ఉద్యోగులు కావాలంటూ తన స్నేహితులకు చెప్పాడు. దీంతో డిగ్రీ చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాసరావు పేటకు చెందిన సీతారామ్ కుమార్, నగరాలకు చెందిన దుర్గం, బారా ఇమాం పంజాకు చెందిన ఇలియస్ సదరు బ్యాంకు నిర్వాహకులను సంప్రదించారు.

Fake Bank.. Collected Deposits from People, Victims complained to Police

ఇలా వచ్చిన వారికి నెలకు రూ.16 వేలు వేతనం ఇస్తామని, ముందుగా బ్యాంకు రుణాలు ఇప్పించే విభాగంలో పని చేయాలని, ఆ తరువాత బ్యాంకులో ఖాతాదారులను చేర్పించడం.. వాటిలో రోజువారీ నగదు జమ చేయించడం వంటి విధులు నిర్వహించాలని చెప్పారు.

బ్యాంకు నిర్వాహకులు చెప్పినట్లుగానే ఆ ఉద్యోగులు తమకు తెలిసిన వారిని బ్యాంకులో ఖాతాదారులుగా చేర్పించారు. రోజువారీ డిపాజిట్లు సేకరించి అందులో జమ చేయించారు. ఏడాది కాలపరిమితి కలిగిన స్కీమ్ లో చేరిన సభ్యులకు.. వారు కట్టిన నగదుకు అదనంగా మరికొంత డబ్బు చేర్చి తిరిగిస్తామని నిర్వాహకులు చెప్పారు.

దీంతో ఈ బ్యాంకులో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు చేరి రోజువారీ నగదు జమ చేశారు. తొలుత ఖాతాదారులను నమ్మించడానికి ఒకరిద్దరికి ఏడాది గడువు ముగిసిన తరువాత వారు కట్టిన నగదుకు అధిక మొత్తం డబ్బులు నిర్వాహకులు అందజేసి అందరికీ మరింత నమ్మకం కలిగించారు.

దీంతో బ్యాంకులో చేరిన ఉద్యోగులు కూడా మరింత ఉత్సాహంతో మరింత మంది ఖాతాదారులను ఆ బ్యాంకులో చేర్పించారు. ఆ తరువాత ఏడాదిన్నర గడిచింది.. గడువు ముగిసిన ఖాతాదారులకు నిర్వాహకులు డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో వారు తమ వద్ద రోజువారీ నగదు కట్టించుకుని వెళ్లే ఉద్యోగులను నిలదీయడం ప్రారంభించారు.

ఈ విషయాన్ని ఉద్యోగులు బ్యాంకు నిర్వాహకులకు తెలిపితే.. ఒకటి, రెండు నెలల్లో ఎవరి డబ్బు వారికి ఇచ్చేద్దామని వారు చెప్పి దాట వేసుకుంటూ వచ్చారు. అయితే ఖాతాదారుల ఒత్తిడి ఎక్కువకావడంతో వారి బాధ భరించలేక ఉద్యోగులు తమ నగలు తాకట్టుపెట్టి కొంతమంది ఖాతాదారులకు వారు డిపాజిట్ చేసిన డబ్బును తిరిగి ఇచ్చేశారు.

ఆ తరువాత కూడా గడువు ముగిసిన ఖాతాదారుల సంఖ్య పెరగడం.. వాళ్లంతా ఒక్కసారిగా తమ డబ్బు తిరిగి ఇచ్చేయమంటూ ఒత్తిడి చేయడం.. ఇళ్ల మీదికి వచ్చి దౌర్జన్యం చేయడంతో ఉద్యోగులు వెళ్లి బ్యాంకు నిర్వాహకులకు తెలుపగా వాళ్లు చేతులెత్తేశారు. దీంతో అవాక్కయిన ఉద్యోగులు నేరుగా గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఒత్తడి చేస్తే మీపైనే కేసులు పెట్టించి లోపల వేయిస్తామంటూ నిర్వాహకులు తిరిగి తమనే బెదిరిస్తున్నారని, అసలు ఎవరి అనుమతితో నిర్వాహకులు ఆ బ్యాంకును స్థాపించారో విచారణ జరిపించాలని, ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు తీసుకుని వారిని మోసం చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించి తగిన చర్య తీసుకుంటామని డీఎస్పీ వారికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A person established a Fake Bank in Guntur at Arandalpet and recurited employees with the help of his friends and collected deposits from people. Without any permissions he established the bank, The employees of the bank complained to Urban SP and requested to enquire on this fraud.
Please Wait while comments are loading...