వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి వ్యాఖ్యలు మార్చుకోవాలి: వైయస్ జగన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన వ్యాఖ్యలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా ప్రజలందరినీ ఒకే చోట కలిపి ఉంచడం సాధ్యం కాదని ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రణబ్ వ్యాఖ్యలపై పైవిధంగా స్పందించారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమైక్య తీర్మానం చేసిన అఫిడఫిట్లను ఆయనకు అందిద్దామని అన్నారు. రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరదామని ఆయన వివిధ పార్టీల ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను కోరారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టినా.. పెట్టకపోయినా రాష్ట్రపతికి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సంతకాలు చేసిన సమైక్య తీర్మాన అఫిడవిట్లను రాష్ట్రపతికి అందిస్తామని చెప్పారు.

YS Jagan

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. వారిద్దరూ అడ్డుపడినా ఎమ్మెల్యేలు మాత్రం తమ మనస్సాక్షిని నమ్ముకుని ముందుడగు వేయాలని, సమైక్య తీర్మాన అఫిడవిట్లను రాష్ట్రపతికి అందజేయాలని ఆయన కోరారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూస్తుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని అన్నారు. పార్లమెంటులో తమ పార్టీ బలం తక్కువైనా ముగ్గురు పార్లమెంటు సభ్యులం సమైక్యం కోసం పోరాడామని చెప్పారు.

తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలతోపాటు తానూ పార్లమెంటులో సమైక్య నినాదాలు చేశామని, స్పీకర్ పోడియాన్ని ముట్టడించి ఆందోళన చేశామని జగన్ చెప్పారు. రాష్ట్ర విభజన సమస్య దేశం మొత్తం తెలిసేలా సమావేశాలను అడ్డుకున్నామని తెలిపారు. మనకు సంబంధించిన రాష్ట్రం కాకపోయినప్పటికీ సమాజ్ వాది పార్టీ, శివసేన పార్టీలను రాష్ట్ర సమైక్యం కోసం కలిశానని తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీల వైఖరి చూస్తుంటే బాధనిపిస్తోందని అన్నారు.

చంద్రబాబు పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు సమైక్యం కోసం పోరాటం చేస్తుంటే.. మరో ఇద్దరు ఎంపీలు విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, టిడిపి ఎంపీలతోపాటు తాము పోడియం వద్దకు వెళ్లి ఆందోళనలు చేసినట్లు చెప్పారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో కేంద్రానికి తాము అడ్డుకాబోమని తేలిపోయిందని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తుంటే టిడిపిలోని నలుగురు ఎంపీలు మద్దతిస్తారు, మరో ఇద్దరు వ్యతిరేకిస్తారని తెలిపారు. ఆ ఎంపీల తీరు చూసి స్పీకర్ మీరాకుమార్, ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలు నవ్వుతున్నారని చెప్పారు.

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు సీమాంధ్ర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదని అన్నారు. అసెంబ్లీకి వచ్చిన తన గదిలోనే కూర్చుని, చర్చ ప్రారంభం అయిందని తెలుసుకుని అసెంబ్లీ లోపలికి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉందని తెలిపారు. బిల్లు అసెంబ్లీకి వచ్చిన రోజే సిఎం అనారోగ్యం పాలవుతారని ఎద్దేవా చేశారు. కిరణ్ సమైక్య పేరుతో సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రానికి వచ్చిన 17గంటల్లోనే ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చేలా సీఎం సంతకాలు చేసి పంపించారని అన్నారు. బిల్లుపై జరుగుతుందన్న సమయంలో సభలో సిఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో లేరని, ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లే బంతులు వేసుకుని, వాళ్లే బ్యాటింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారు బౌన్సులు వేస్తున్నారో, స్పిన్ వేస్తున్నారో తెలియక తాము బ్యాటు పట్టుకుని తికమక పడుతున్నామని చెప్పారు.

సమైక్య రాష్ట్రం కోసం సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాలను ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి విరమింపజేశారని చెప్పారు. జులైలో విభజన నిర్ణయం జరిగితే అసెంబ్లీలో ఏనాడైనా సిఎం అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేశారా అని ప్రశ్నించారు. అన్ని పథకం ప్రకారమే జరుగుతున్నాయని ఆరోపించారు. తాము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉండే వారినే ప్రధాని కూర్చిలో కూర్చోబెడతామని చెప్పారు. సమైక్యం కోసం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిశామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాలు నాశనమవుతాయని అన్నారు. చివరి నిమిషం వరకు తాము సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.

English summary
YSR Congress president YS Jagan suggested president Pranab Mukherjee to change his views on the demands of creation of new states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X