
vastu tips: ప్రహరీగోడను నిర్లక్ష్యం చెయ్యకండి? ప్రహరీగోడ వాస్తు నియమాలను తెలుసుకోండి!!
ఇంటి నిర్మాణానికి ఏ విధంగా అయితే వాస్తు నియమాలను పాటించాలో .. అదేవిధంగా ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. స్థలాన్ని కొన్న తర్వాత ఇంటిని నిర్మించుకోవడానికి ముందే ప్రహరీ గోడ నిర్మించుకోవడం అన్ని విధాలా మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో చిన్నచిన్న వాస్తు నియమాలను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ప్రహరీ గోడ నిర్మాణంలో తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తలివే
ఇక ప్రహరీ గోడ నిర్మించే విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వస్తే ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ ప్రాంతంలో ఉండే ప్రహరీ గోడలను చాలా దృఢంగా నిర్మించుకోవాలి. దక్షిణ-పశ్చిమ గోడలు ఉత్తరం వైపు, తూర్పు వైపు ఉన్న గోడల కన్నా చాలా ఎత్తుగా నిర్మించాలి. దక్షిణ-పశ్చిమ గోడలు దృఢంగా ఉంటే ఎన్నో రకాలైన దోషాలను హరిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పరిసరాల వాస్తు దోషాలను ఇంటికి తగలకుండా కాపాడడంలో ప్రహరీ గోడలు కీలక భూమిక పోషిస్తాయి.

తూర్పు, ఉత్తర దిక్కున ప్రహరీ గోడలు తక్కువ ఎత్తులో నిర్మించుకుంటే ఫలితాలివే
ఇంటికి దక్షిణం వైపు పల్లంగా ఉన్నా, గుంటలు ఉన్న, బావులు ఉన్న దక్షిణ భాగాన్ని ఎత్తు చేసి ప్రహరీ గోడలు దృఢంగా నిర్మించుకుంటే వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. ఒక ఇంటికి పశ్చిమంవైపు కూడా ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. ఏదైనా చెడు వీధిపోటు ఇంటికి తగలకుండా ప్రహరీ గోడ అడ్డుకుంటుందని చెబుతారు. ఇక దక్షిణం, పశ్చిమ ప్రహరీ గోడలను ఎత్తుగా నిర్మించి తూర్పు, ఉత్తర దిక్కున ప్రహరీ గోడలను తక్కువ ఎత్తులో నిర్మించుకోవాలని, తక్కువ మందంతో నిర్మించుకోవాలని చెబుతున్నారు. అలా తక్కువ ఎత్తులో తూర్పు, ఉత్తర దిక్కున ప్రహరీ గోడలు నిర్మించుకుంటే అధిక ధనాదాయం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని చెబుతున్నారు.

ఇంటి ప్రధాన ద్వారాల కన్నా ప్రహరీగోడ ఎత్తు ఉండొచ్చా?
ఇక ప్రహరీ గోడ విషయంలో నిర్లక్ష్యం మంచిదికాదని, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రహరీగోడ ను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. ప్రహరీ గోడ లోపాలు ఏవైనా ఉంటే సరిచేసుకోవాలని చెబుతున్నారు. ప్రహరీ గోడ పాతబడి కూలిపోతే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మరమ్మతు చేయించుకోవడం వల్ల, ఆ గృహస్థులకు కలిగే దోషాలను తొలగించుకోవచ్చని చెబుతున్నారు. ప్రహరీ ఇంట్లో ద్వారాల కన్నా ఎత్తు కాకుండా నిర్మించడం మంచిదని సూచిస్తున్నారు. ఇంటి ముఖద్వారం ముందు నిలబడితే ప్రహరీ గోడ బయట కనిపించాలని సూచిస్తున్నారు.

దక్షిణ, పశ్చిమ వీధుల ఇళ్ళకు ప్రహరీ గోడ ఇలానే ఉండాలి
తూర్పు, ఉత్తర దిక్కులలో ప్రధాన ద్వారం కంటే ఎత్తు తక్కువగా ప్రహరీ గోడ ఉండడంవల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు దక్షిణ-పశ్చిమ వీధుల గృహములకు ప్రహరీ గోడ గృహ ప్రధాన ద్వారం కన్నా ఎత్తుగా, లేదా సమానంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో ఇలా చిన్ని చిన్ని వాసు చిట్కాలను పాటిస్తే ప్రహరీ గోడ కూడా ఇంటికి అనేక రకాలైన పరిసర వాస్తు దోషాల నుంచి రక్షణ కల్పిస్తుందని, కుటుంబ సభ్యులకు శ్రేయస్సును ఇస్తుందని చెబుతున్నారు. ఇంకా ప్రహరీగోడలకు సంబంధించి వాస్తు గురించి తెలీని చాలా మంది ప్రహరీగోడల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కూలిపోయినా కట్టించరు. అలా నిర్లక్ష్యం చేస్తే ప్రతికూల ఫలితాలు ఇంటిపై ఉండే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
vastu tips: ఈ వీధిపోటు ఉన్న ఇంట్లో మగవారు మట్టి ముట్టుకున్నా బంగారమే!!