స్వాతి కిల్లర్ కలెక్టర్ కావాలని కలగన్నాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతిని అత్యంత దారుణంగా హత్య చేసిన రామ్ కుమార్ గురించి మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. కలెక్టర్ కావాలని అతను కల గన్నాడు. స్వాతి ప్రేమించలేదని ఆవేశానికి గురై హంతకుడిగా మారాడు. వెనక్కి రావడానికి కూడా వీల్లేని స్థితిలో కూరుకుపోయాడు.

పోలీసులను చూసి గొంతు కోసుకున్న రామ్ కుమార్ ఆదివారం ఉదయానికి కోలుకున్నాడు. దాంతో రామ్‌కుమార్‌ను అక్కడి ఆస్పత్రిలోనే నుంగంబాక్కం డిప్యూటీ కమిషనర్‌ దేవరాజ్‌ విచారించారు. స్వాతిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని అడగ్గానే దేవరాజ్‌ ప్రశ్నించగానే రామ్‌కుమార్‌ తొలుత బోరున ఏడ్చేశాడని సమాచారం. ఆ తర్వాత దేవరాజ్ ప్రశ్నలకు సమాచారం ఇచ్చాడు.

జూన్ 24వ తేదీ ఉదయం స్వాతిని కలుసుకుని తన ప్రేమను అంగీకరించాలని వేడుకున్నానని, ఆ రోజు కూడా ఆమె తన మాటలు వినగానే తనపై జోక్‌లు వేసిందని, దాంతో తనతో తెచ్చుకున్న కత్తితో ముందుగా నోటిపై నరికానని చెప్పాడు. ఆమె చనిపోయిందని నిర్ధారణ అయిన తరువాతే అక్కడి నుంచి పారిపోయానని అతను వాంగ్మూలం ఇచ్చాడు.

Also Read: టెక్కీ హత్యలో ట్విస్ట్: నిందితుడితో స్వాతికి ఫ్రెండ్‌షిప్! పక్కా ప్లాన్..

Swathi's killer Ram Kumar wanted to become a collector

రామ్‌కుమార్‌ తల్లిదండ్రులు పుష్పం, పరమశివం, సోదరీమణులు మధుబాల, కాళీశ్వరి వద్ద డిప్యూటీ కమిషనర్‌ దేవరాజ్‌ రహస్యప్రదేశంలో విచారణ చేపట్టారు. హత్య తరువాత సొంత ఊరికి వచ్చిన రామ్‌కుమార్‌ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి, అతని ప్రేమ విషయం గురించి వారికేమైనా తెలుసా అన్న వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.

హత్య జరిగిన రెండు రోజుల తర్వాత రామ్‌కుమార్‌ సొంత ఊరికి వచ్చాడని, సెలవుల కారణంగానే ఇంటికి వచ్చినట్టు తల్లిదండ్రుల వద్ద చెప్పాడని తెలుస్తోంది. ఊరికి వచ్చిన తరువాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని, అతను అతి మామూలుగా వున్నాడని వారు వివరించారు.

స్వాతి సెల్‌ఫోన్ స్వాధీనం

రామ్‌కుమార్‌ ఇంట్లో పోలీసులు నిర్వహించిన తనిఖీలో స్వాతి సెల్‌ఫోన, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ రామ్‌కుమార్‌ ఇంట్లో తనిఖీ నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరుతూ సెంగోటై న్యాయస్థానంలో డిప్యూటీ కమిషనర్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు న్యాయమూర్తి అనుమతించడంతో ఆదివారం కూడా ఆ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

ఊళ్లో మిత్రులు లేరు...

సొంత ఊరిలో ఎవరితోనూ రామ్‌కుమార్‌ మాట్లాడేవాడు కాదని, అతనికి మిత్రులు ఎవరూ లేరని, అవకాశం దొరికినప్పుడల్లా మేకలను కాసేందుకు వెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు. ఆలంగులంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీఈ చదువుకున్న రామ్‌కుమార్‌ సెంగోటైలోని ఓ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.3.20 లక్షలు రుణం పొంది విద్యాభ్యాసం చేశాడు. కలెక్టర్ కావాలని అతను బాల్యం నుంచి కోరుకునేవాడని చెబుతున్నారు, అయినా పరీక్షలు సరిగా రాయకపోవడంతో నాలుగు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. అధ్యాపకుల సూచనల మేరకే అతను చెన్నై వచ్చాడు.

Also Read: స్వాతిని ఎఫ్‌బీలో చూసి ప్రేమించా! 'కొండముచ్చు' అనడంతోనే ఉన్మాదినయ్యా: రాంకుమార్

స్నేహితుడి వివరణ..

స్వాతి హత్యకేసులో ఆమె స్నేహితుడి హస్తం ఉందంటూ చెలరేగుతున్న వివాదానికి తెర దింపేందుకు బిలాల్‌ మాలిక్ అనే యువకుడు ప్రయత్నించాడు. ఆ బిలాల్‌ను తానేనని, స్వాతి తనకు మంచి స్నేహితురాలని అతను చెప్పాడు. స్వాతి తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు కూడా తనతో పంచుకునేదని అతను ఆదివారం మీడియాతో చెప్పాడు.

గత కొన్ని నెలల క్రితం ఆమెను ఓ వ్యక్తి వెంటాడుతున్నాడన్న విషయం కూడా తనకు చెప్పిందని చెప్పాడు. ఒకసారి రైలుప్రయాణంలో ఆ వ్యక్తి వెంబడించి కార్యాలయం వరకు వచ్చినట్టు స్వాతి తనతో చెప్పిందని బిలాల్‌ తెలిపాడు. స్వాతి ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేదని వివరించాడు.

స్వాతి హత్య కేసును ఛేదించిన పోలీసులు వీరే...

స్వాతి హత్య కేసును ఛేదించేందుకు నగర కమిషనర్‌ టీకే రాజేంద్రన నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. అదనపు కమిషనర్‌ శంకర్‌ ప్రతిరోజూ ఈ హత్యకేసుకు సంబంధించిన విషయాలను ప్రత్యేక బృందాలకు వివరించేవారు.

ఈ ప్రత్యేక బృందంలో జాయింట్‌ కమిషనర్లు మనోహరన, అప్పు, డిప్యూటీ కమిషనర్లు శరవణన, పెరుమాళ్‌, అదనపు కమిషనర్లు బాల సుబ్రమణ్యన, సహాయ కమిషనర్లు దేవరాజ్‌(నుంగంబాక్కం), ముత్తువేల్‌ పాండి (ట్రిప్లికేన), కాళితీర్థన (ఎగ్మూర్‌), ఆనంద్‌బాబు (ఎగ్మూర్‌), భారతి (నుంగంబాక్కం), రవికుమార్‌ (మైలాపూర్‌), మదిఅళగన (చూలైమేడు), మిల్లర్‌ (సచివాలయం), చంద్రు (వలసరవాక్కం), విజయ కుమార్‌ (థౌజం డ్‌లైట్స్‌), యువరాణి (మైలాపూర్‌), ఏడుగురు ఎస్సైలు వున్నారు.

స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్‌కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. పోలీసులకు పట్టుబడిన వెంటనే రామ్‌కుమార్‌ గొంతు కోసుకున్నాడు. దాంతో పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. రామ్‌కుమార్‌ను సోమవారం తిరునెల్వేలి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో మెడికల్‌ బృందం, పోలీస్‌ ఎస్కార్ట్‌తో కోర్టులో ప్రవేశపెట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Infosys techie Swathi's killer Ram Kumar wanted to become a collector.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి